- వ్యాఖ్యలపై మధ్యంతర ఆదేశాలు
ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కి బెంగళూరులోని సివిల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష లేదా సంస్కృతిని కించపరిచేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆయనను ఆదేశిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదంతా కమల్ హాసన్ చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్యపై మొదలైంది. తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకతను రేపాయి. పలు కన్నడ సంఘాలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్షమాపణ చెప్పాలని పలుమార్లు కోరినప్పటికీ కమల్ నిరాకరించడంతో వివాదం తీవ్రంగా మారింది. దాంతో పాటు, కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదల కూడా నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో, కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్ వూరాలా, బెంగళూరు కోర్టులో కేసు దాఖలు చేశారు. కేసును విచారించిన అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి ఎన్.ఆర్. మధు, కమల్ హాసన్‌పై మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తూ, భవిష్యత్తులో కన్నడ భాష, భూమి, సంస్కృతి గురించి నెగటివ్‌గా మాట్లాడవద్దని ఆంక్షలు విధించారు. అంతేగాక, ఆగస్టు 30న జరగనున్న తదుపరి విచారణకు కమల్ హాసన్ స్వయంగా హాజరుకావాలని ఆదేశిస్తూ కోర్టు సమన్లు కూడా జారీ చేసింది.
Read : సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డులు.. జ్ఞాపిక ఆవిష్కరణ!