- ఆయనే నా పేరును ‘అర్చన’ అని మార్చారు : నటి అర్చన
‘అర్చన’ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘నిరీక్షణ’. బాలూ మహేంద్ర దర్శకత్వంలో 1982లో విడుదలైన ఈ చిత్రం కథా, కథనాల పరంగా తెలుగు సినీ ప్రపంచాన్ని ఓ కొత్త దిశగా తీసుకెళ్లింది. ఈ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు పొందిన అర్చన, ఆ తర్వాత ‘లేడీస్ టైలర్’ సినిమాలోనూ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించిన సినిమా ‘షష్ఠి పూర్తి’ ఈ నెల 30న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ:
“నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న తర్వాతనే నటన వైపు వచ్చాను. మా అమ్మవారి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌కి చెందినదే కావడంతో, నాకు తెలుగు బాగా వస్తుంది. తెలుగులో నా తొలి చిన్న పాత్ర ‘MLA ఏడుకొండలు’ సినిమాలో. కానీ హీరోయిన్‌గా పరిచయం చేసిన సినిమా మాత్రం ‘నిరీక్షణ’. బాలూ మహేంద్రగారే నన్ను లీడ్ రోల్‌లో ప్రవేశపెట్టారు” అని తెలిపారు.
అలాగే, తన పేరును ఎలా మార్చుకున్నారన్న విషయాన్నీ ఆమె ఆసక్తికరంగా వివరించారు:
“నా అసలు పేరు సుధ. నేను ఇండస్ట్రీకి అడుగుపెట్టే సమయంలో తెలుగు, తమిళ భాషల్లో జయసుధగారు స్టార్ హీరోయిన్. నేను కూడా ఆమె అభిమానిని. నా పేరు ‘సుధ’ ఆమె పేరుతో దగ్గరగా ఉండడం నన్ను కొద్దిగా అసౌకర్యానికి గురి చేసింది. జయసుధగారి పట్ల గౌరవంతోనే నా పేరును మార్చుకోవాలని భావించాను. ఈ విషయాన్ని బాలూ మహేంద్రగారికి చెప్పగా, ఆయనే నాకు ‘అర్చన’ అనే పేరు సూచించారు. అప్పటినుంచి అదే పేరు కొనసాగుతోంది” అన్నారు.
Read : Harihara Veeramallu | హరిహర విరమల్లు నుంచి ‘తార తార నా కళ్లు’ సాంగ్ విడుదల