-
ఫిల్మ్ ఫెస్టివల్‌లో కుశేందర్ రమేశ్ రెడ్డికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు
రజాకార్’ చిత్రంలో తన అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన కుశేందర్ రమేశ్ రెడ్డికి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఈ సినిమాలోని విజువల్స్‌కు విశేషమైన ఆదరణ లభించగా, తాజాగా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఆయనకు పురస్కారం లభించింది.
కుశేందర్ రమేశ్ రెడ్డి కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన కెమెరామెన్షిప్‌ను పటిష్ఠంగా తయారు చేసుకున్న విధానం స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఈగ’, ‘బాహుబలి 1 & 2’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాల్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ వద్ద చీఫ్ అసోసియేట్‌గా పని చేసిన ఆయన, అనుభవాన్ని ఆయుధంగా మలచుకుని ఇప్పుడు తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
‘రజాకార్’ సినిమా ద్వారా దర్శకుడు యాటా సత్యనారాయణ చరిత్రలో దాగి ఉన్న నిజాలను, మరచిపోయిన వీరులను తెరపైకి తీసుకువచ్చారు. ఆయన దృష్టికి సినిమాటోగ్రఫీలో కుశేందర్ గొప్ప సాయంగా నిలిచారు. చరిత్రను తిరిగి చూడగలుగుతున్నట్లు చేసే విజువల్స్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనది.
తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ కెమెరామెన్‌గా అవార్డు అందుకున్న కుశేందర్ రమేశ్ రెడ్డి, ప్రస్తుతం రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. అందులో ఒకటి – వానర సెల్యులాయిడ్, డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బార్బరిక్’, మరొకటి – అనిల్ విశ్వనాథ్ కథ ఆధారంగా నాని దర్శకత్వంలో అల్లరి నరేశ్, కామాక్షి భాస్కర్ల నటిస్తున్న ‘12A రైల్వే కాలనీ’. ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా, కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే కుశేందర్ రమేశ్ రెడ్డి, ప్రతి కథలోని భావోద్వేగాన్ని, దృక్పథాన్ని తన కెమెరా కళతో తెరపైకి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దర్శకుల దృశ్యవీక్షణానికి పరిపూర్ణ రూపం ఇవ్వడంలో ఆయన ప్రావీణ్యం మరింత వెలుగులోకి వస్తోంది.
Read : Masood: సమ్మర్లో గజగజలాడించే హారర్ థ్రిల్లర్ మసూద ఓటీటీలో!