థ్రిల్లర్ జానర్‌కి చెందిన కంటెంట్ ఏ భాషలో వచ్చినా ప్రేక్షకుల నుంచి ఎప్పటికప్పుడు మంచి ఆదరణ పొందుతోంది. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్‌లాగే, ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్‌ల కథలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ తరహా సిరీస్‌లు ప్రతి సీజన్‌తో తమ స్థాయిని మరింతగా పెంచుకుంటూ వస్తున్నాయి. ఆ వరుసలో నిలిచే వెబ్ సిరీస్ ‘మహారాణి’.
హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సాధారణ గృహిణి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందనను రాబట్టాయి. ఇప్పుడు, ఆ విజయాన్ని కొనసాగిస్తూ ‘మహారాణి – సీజన్ 4’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో, ముఖ్యమంత్రిగా కొనసాగిన మహారాణి ఇక ప్రధానమంత్రి స్థానం దిశగా తన అడుగులు వేస్తోందని చూపించారు. ఈ కొత్త సీజన్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సీజన్‌లో హ్యూమా ఖురేషి సరసన శ్వేతా బసు ప్రసాద్, విపిన్ శర్మ, అమిత్ సియాల్, వినీత్ కుమార్, శార్దూల్ భరద్వాజ్, ప్రమోద్ పాఠక్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
