- రీ–రిలీజ్ కోసం సినిమా చూస్తుండగా కొత్త అర్థం దొరికిందన్న ఆర్జీవీ
- “శివ ఒక మనిషి కాదు, భయానికి లొంగని ఒక సిద్ధాంతం”
- ఆత్మగౌరవం విషయంలో శివ ఆలోచనల్లో గాంధేయత ఉంది
- “శివ మౌనం అతిపెద్ద ఆయుధం” – వర్మ
- “అందుకే 36 ఏళ్లైనా శివను ఎవరూ మర్చిపోలేదు”
తెలుగు సినిమా చరిత్రలో ఒక యుగాన్ని మార్చిన చిత్రం ‘శివ’. ఆ సినిమా విడుదలై 36 ఏళ్లు పూర్తవుతున్న వేళ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘శివ’పై కొత్తగా ఆలోచించిన విషయాలను పంచుకున్నారు. నాగార్జున కెరీర్‌కు మలుపు తిప్పిన ఈ సినిమా, వర్మకు దర్శకుడిగా గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు రీ–రిలీజ్ సందర్భంగా మళ్లీ చూసినప్పుడు, 26 ఏళ్ల వయసులో తాను ఊహించి సృష్టించిన శివ పాత్రను, 62 ఏళ్ల వయసులో పూర్తిగా అర్థం చేసుకున్నానని వర్మ చెప్పారు.
‘శివ’ – ఆత్మగౌరవానికి ప్రతీక
“శివలో ఉన్న అసలు శక్తి అతని ఆత్మగౌరవం. బెదిరింపులకు తలొగ్గడం కంటే చావడమే మంచిదని నమ్మే వాడు. అతనికి గౌరవం అనేది ఒక విలువ కాదు, మనిషి ఉనికికి సంకేతం,” అని వర్మ వివరించారు.
అతను పెద్దగా మాటలు మాట్లాడడు, భావోద్వేగాలను ప్రదర్శించడు — ఎందుకంటే అతని శక్తి మౌనంలో ఉంది.
“శివ కీర్తి కోసం లేదా ప్రతీకారం కోసం పోరాడడు. అతను తిరుగుబాటు చేయడానికి కారణం అణచివేతను సహించలేకపోవడం మాత్రమే,” అని వర్మ పేర్కొన్నారు.
మౌనం, హింస వెనుక ఉన్న ఆలోచన
వర్మ అభిప్రాయంలో, శివ మనసులో శాంతి–హింసల మధ్య నిరంతర పోరాటం ఉంది.
“శివ ధైర్యం భయం లేకపోవడం వల్ల కాదు — స్పష్టత వల్ల. అతనికి ఏ దాని కోసం జీవించాలో, ఏ దాని కోసం చనిపోవాలో తెలుసు. అందుకే భయం అతని దగ్గరికి రాదు,” అని చెప్పారు.
“అతనికి హింస అంటే ఇష్టం లేదు, కానీ అవసరం అయితే అది తప్పదు. అవినీతి, అణచివేత భాష హింసనే అనుకునే వాడే శివ,” అని వర్మ అన్నారు.
అధికారంపై శివ దృష్టి
“శివ అధికారాన్ని ద్వేషించడు, కానీ దాని దుర్వినియోగాన్ని మాత్రం తట్టుకోలేడు.
అతనికి వ్యవస్థ అనేది నియంత్రణ కోసం కావాలి, కానీ గౌరవాన్ని దెబ్బతీయటానికి కాదు. అందుకే నేరస్థులు, రాజకీయ నాయకులు అతనికి భయపడతారు — ఎందుకంటే అతనిని ప్రలోభపెట్టలేరు, భయపెట్టలేరు. ప్రాణాలకే తెగించిన వాడిని ఎవరు ఆపగలరు?” అని వర్మ ప్రశ్నించారు.
‘శివ’ – ఒక సిద్ధాంతం
“శివ ఒక వ్యక్తి కాదు — అది ఒక సిద్ధాంతం. రాజీలతో నిండిన వ్యవస్థలో, ఒక మనిషి తన నిజాయితీతో మార్పు తెచ్చగలడనే సందేశం శివ ఇస్తాడు. అతను హీరో అయ్యింది గెలిచినందుకు కాదు, తన విలువలను కోల్పోకుండా నిలిచినందుకు. ప్రతి ఒక్కరూ శివలా ఉండాలని కోరుకుంటారు, కానీ ధైర్యం ఉండదుకాబట్టి అతన్ని ఆరాధిస్తారు. అందుకే 36 ఏళ్ల తర్వాత కూడా శివ పాత్ర మరచిపోలేనిదిగా నిలిచింది,” అని వర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read more : Nithiin Tammudu trailer : నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ విడుదల: భావోద్వేగాలకు, యాక్షన్‌కు సమపాళ్ళు!