-
పాలిటిక్స్ అంటే తనకు ఆసక్తి లేదన్న హీరో అజిత్ కుమార్
తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంలో, రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్న సినీ నటీనటులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, తనకు మాత్రం రాజకీయాల్లో ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి వస్తూ ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఆశించే ప్రతి ఒక్కరికీ విజయం కలగాలని కోరుకుంటానని తెలిపారు. ఈ సందర్భంలో తన సన్నిహితుడు, నటుడు దళపతి విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి రావడాన్ని ప్రస్తావిస్తూ, అది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని ప్రశంసించారు.
ఇండియా వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో వేర్వేరు మతాలు, భాషలు, జాతులు కలిగిన ప్రజలు పరస్పర సామరస్యంతో జీవించడాన్ని అజిత్ ఒక గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఇటువంటి వైవిధ్యభరిత దేశాన్ని ఏకతాటిపై నడిపించడం రాజకీయ నాయకులే చేయగలరు అని అభిప్రాయపడ్డారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును స్వీకరించిన అజిత్, రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు తనను ఆశ్చర్యానికి గురిచేశాయంటూ, ఆ సమయంలోనే దేశ నాయకులు ఎలా జీవిస్తున్నారు, వారు ఏ మేరకు బాధ్యతలు తీసుకుంటున్నారన్నది తనకు పూర్తిగా అర్థమైందన్నారు.
దేశాన్ని లేదా రాష్ట్రాన్ని పరిపాలించడం ఎంత క్లిష్టమైన పని అనేది తనకు ఆ సమయంలో బోధపడిందని తెలిపారు. అందుకే విజయ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి అడుగు పెట్టడం నిజంగా ధైర్యవంతమైన నిర్ణయమేనని అజిత్ అభిప్రాయపడ్డారు.
Read : Ajith Kumar : బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం