-
ఆ వివాదంపై క్లారిటీ.. ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
ఇటీవల జరిగిన ‘రెట్రో’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. పాకిస్తాన్ పరిణామాలపై స్పందిస్తూ, “ట్రైబల్స్‌లా కొట్టుకోవడం ఏంటి?” అన్న ఆయన వ్యాఖ్యలు ఆదివాసీ సంఘాల ఆగ్రహానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలతో గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారని, అవమానంగా ఉందని ట్రైబల్ జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందించారు. గిరిజనుల చరిత్ర, సంస్కృతిని అవమానించేలా వ్యాఖ్యానించడం మానవ విలువలకు విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో, తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు న్యాయవాది కిషన్‌రాజ్ చౌహాన్, ఇతర ప్రతినిధులతో కలిసి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
వివాదం తీవ్రతను గమనించిన విజయ్ దేవరకొండ తాజాగా మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యల ఉద్దేశం వక్రీకరించబడి ఉండవచ్చని పేర్కొంటూ, ఎవరినైనా బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.
విజయ్ వివరణ ప్రకారం:
“రెట్రో ఆడియో ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలు కొందరికి బాధ కలిగించాయని నాకు తెలిసి తీవ్రంగా చింతిస్తున్నాను. నేను ఏదీ ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు. గిరిజనుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. వారికి అభ్యంతరకరంగా ఉండేలా మాట్లాడాలన్న ఉద్దేశమే లేదు.
నేను దేశ ప్రజల ఐక్యత గురించి మాత్రమే మాట్లాడాను. మనమంతా కలిసికట్టుగా ఉండాలి అన్న సూత్రాన్ని ప్రతిపాదించాను. ‘ట్రైబల్స్’ అనే పదాన్ని చారిత్రక, డిక్షనరీ ప్రాతిపదికన వాడాను. నా వ్యాఖ్యల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ను ఉద్దేశించిన విషయమే లేదు. బ్రిటిష్ పాలనలోనే ఈ వర్గీకరణలు మొదలయ్యాయి – వాటికి ముందు ప్రజలు గుంపులుగా, క్లాన్స్‌గా ఉండేవారు. నేను చెప్పినది అదే సందర్భంలో.
ఎవరినైనా నా మాటలు బాధపెట్టితే నేను నిజంగా విచారిస్తున్నాను. నా లక్ష్యం శాంతి, ఐక్యత గురించి మాట్లాడటమే.”
Read : Ajith Kumar : పాలిటిక్స్ అంటే తనకు ఆసక్తి లేదన్న హీరో అజిత్ కుమార్