నిర్మాత బండ్ల గణేశ్ నోరు విప్పితే సంచలనం ఖాయం. ఆయన వ్యాఖ్యలు తరచూ వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా విజయోత్సవ సభలో ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు మరోసారి తెలుగు సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వల్ల తాను తీవ్రంగా బాధపడ్డానని, ఆ వేడుకలోని సంతోష వాతావరణం పూర్తిగా మాయమైందని నిర్మాత బన్నీ వాసు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశారు.
వివాదానికి కారణమైన వ్యాఖ్యలు
‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌లో బండ్ల గణేశ్ మాట్లాడుతూ,
“ఇండస్ట్రీలో అందరూ మెగాస్టార్ బావమరిదిలా, స్టార్ కమెడియన్ కొడుకులా, ఐకాన్ స్టార్ తండ్రిలా పుట్టరు. అది కొందరికే దక్కే అదృష్టం. మిగిలిన వాళ్లు ఎంత కష్టపడినా చివరికి పేరు మాత్రం వాళ్లకే వెళ్తుంది,”
అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ను ఉద్దేశించాయని అప్పుడు చర్చ మొదలైంది. ఆ సమయంలో వేదికపై అల్లు అరవింద్ పక్కనే ఉన్న బన్నీ వాసు అసహనానికి గురయ్యారు. మైక్ అందుకున్న బన్నీ వాసు వెంటనే స్పందిస్తూ,
“అల్లు అరవింద్ గారు స్టార్ కమెడియన్‌కు పుట్టారని చెప్పడం సరైంది కాదు. ఆయన పుట్టిన తర్వాతే అల్లు రామలింగయ్య గారు స్టార్ కమెడియన్ అయ్యారు. బహుశా ఈ విషయం బండ్ల గణేశ్ గారికి తెలియకపోవచ్చు,”
అని స్పష్టత ఇచ్చారు.
బన్నీ వాసు ఆవేదన
తాజాగా ఈ విషయంపై మళ్లీ స్పందించిన బన్నీ వాసు మాట్లాడుతూ, “బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు నాకు నిజంగా షాక్ ఇచ్చాయి. తెలుగు సినీ పరిశ్రమ కోసం అల్లు అరవింద్ గారు చేసిన సేవలు అద్భుతమైనవి. అలాంటి వ్యక్తి గురించి అలా మాట్లాడడం చాలా బాధ కలిగించింది. ఆ వ్యాఖ్యలతో ఆ వేడుకలోని సంతోషం పూర్తిగా పోయింది,” అని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో ఈ ఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బండ్ల గణేశ్ నిజాయతీగా మాట్లాడారని సమర్థిస్తుంటే, మరికొందరు ఒక వేడుక వేదికపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడుతున్నారు.
Read more : Ram Gopal Varma | 36 ఏళ్ల తర్వాత ‘శివ’పై వర్మ కొత్త విశ్లేషణ