-
సినిమాగా ‘ఆపరేషన్ సింధూర్’.. ఫస్ట్ పోస్టర్ రిలీజ్
జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇప్పుడు వెండితెరపైకి రానుంది. పాక్ ఆధారిత ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, తొమ్మిది శిబిరాలను బాంబులతో నాశనం చేసిన ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం చూపించిన ధైర్యం, వ్యూహాత్మక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు.
నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు ఉత్తమ్ మహేశ్వరి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ చిత్రంపై ఆసక్తిని పెంచింది. పోస్టర్లో ఒక మహిళా సైనికురాలు – రైఫిల్ పట్టుకుని, తన ముద్దు భాగంలో సింధూరం దిద్దుకుంటూ వెనక్కి తిరిగి నిలబడిన తీరు – దేశభక్తిని ప్రతిబింబించేలా ఉంది. బ్యాక్‌డ్రాప్‌లో యుద్ధ ట్యాంకులు, ముళ్ల కంచెలు, గగనతలంలో ఎగురుతున్న యుద్ధ విమానాల చిత్రణ, వాతావరణాన్ని ఉద్వేగభరితంగా మలిచింది.
టైటిల్ “ఆపరేషన్ సింధూర్”లో ‘O’ అక్షరం స్థానంలో కుంకుమ బిందు రూపంలో రూపొందించబడిన డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. త్రివర్ణ పతాక రంగులతో “భారత్ మాతా కీ జై” అనే నినాదం పోస్టర్‌కు దేశభక్తి జోష్‌ను జతచేస్తోంది.
సైనికుల త్యాగం, మహిళా అధికారుల పాత్ర, యుద్ధ నేపథ్యంలో దేశభక్తి, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా రూపొందనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారని కూడా వెల్లడించారు.